Tuesday 26 August 2014

కె.ఎన్.వి.ఎం.వర్మ//అన్నగా పుట్టినందుకైనా//

కె.ఎన్.వి.ఎం.వర్మ//అన్నగా పుట్టినందుకైనా//

మనం ఒకసారి మాట్లడుకోవాలి
నిజాల్ని
నిజాల్ని మాత్రమే
చరిత్రలాంటి నిజాల్ని
నిక్షర్షగా నిర్బయంగా మాట్లాడుకోవాలి

మాట్లాడుకోంటూ...
అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించగలినప్పుడే
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు
అన్న గాంధీ మహాత్ముని మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి

అర్ధరాత్రి డిల్లీలో నిర్బయ
పట్టపగలు పహాడీ అతిధిగృహంలో ఇంకో అబల
మగాళ్ళ సాక్షిగా ఏమైపోయారో...
అర్ధరాత్రికి పట్టపగలికి నడుమ
ఎందరో ఇంకెందరో ఏమైపోయారో...
ఒకసారి మనం మాట్లాడుకోవాలి

వస్త్రధారణ గురించో
వర్తమాన సాంస్కృతిక గురించో
వక్ర బాష్యాలు కాదు
వక్ర బుద్దులని
ఉన్మాద మద మగతన్నాన్ని
ఉరివేయడం తప్పన్న మానవతావాదుల గురించి
మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి

మృగాడి తరపు న్యాయవాదులకు
ధర్మదేవత కళ్ళగుడ్డ నోటిలో కుక్కి
మనం కొన్ని నిర్ణయాలూ తీసుకోవాలి

ఇది సరైన సమయం మాట్లాడుకోవడానికి
మాట్లాడుకోవడమంటే
ఉదయాన్నే టి.విలలో చర్చాకార్యక్రమం కాదు
చట్ట సభల్లో చట్టాలు అంతకన్నాకాదు

మాట్లాడుకోవటమంటే
ఆ దుర్మార్గుడి జుట్టు మన గుప్పిటలో మిగిలిపోవాలి
వాడి రక్తంతో తడిసిన రాయి గర్వపడాలి
పోలీస్ బులెట్లు వాణ్ణి జల్లెడ పట్టాలి
అనాగరికుడు కదా అడవిలో జంతువులకు పంచాలి
మృగాణ్ణి చంపిన ప్రజలని హెడ్ లైన్స్ రావాలి
ఇలా ఓ కార్యాచరణ కార్యరూపం దాల్చాలి
ఇలా మనం మాట్లాడుకోవాలి
చరిత్రలో కూడా ఇలాగే రాసుకోవాలి

మాట్లాడుకోవటమంటే చేతల్లో చూపాలి.....26.08.2014

Sunday 24 August 2014

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఓ...ఆలింగనం//

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఓ...ఆలింగనం//
మకరందం నిండి
మత్తిల్లి గాలిఊయలూగుతూ
ముద్ద బంతి
మట్టి వాసన వేసినట్టు
ఆకాశాన్ని మింగిన కరి మేఘం
అరవీర ఘర్జనలు చేస్తూ
ఆకుపచ్చని
అభిషేకించ వర్షించినట్టు
కోనసీమ కొంగుబట్ట
కోటిలింగాల రేవు దాటి
కటి సంద్రానికి గోదారి
కాలమై తరలినట్టు
ఉగ్రరూపి కపాళదారిణి
ఉత్త అలంకారానికే మావుళమ్మ
ఊరికంతా
ఉక్కిరి బిక్కిరయ్యే సంపదిచ్చినట్టు
మాలలా అల్లుకొని
మరొకసారి బాపూ అలయ్ బలయ్ లని
మనిషొకడు
మనిషి వాసన వేస్తూ మిగిలినట్టు.....23.08.2014.

నదీ మూలం లాంటి ఆ ఇల్లు - మూడో వేప చెట్టు

నదీ మూలం లాంటి ఆ ఇల్లు - మూడో వేప చెట్టు
ఇప్పటికే మిత్రుల పుస్తకాలు చాలా చదవాల్సినవి ఉన్నాయి అనుకొంటూ హైదరబాదు నుంచి తెచ్చుకున్న ఐదు పుస్తకాలు అల్మారాలో సర్దబోతూ ఆగాను, అందరూ captain అని పిలుచుకొనే కవి సంగమం కురువృద్దుడు యాకూబ్ లోతైన కళ్ళు కాసేపు ఆలోచనలో పడేసాయి. 14ఏళ్ళ క్రితం పట్టుదలకు పోయి ఇల్లు వదిలి ఇల్లాలి పోరు బరించలేక అప్పుడప్పుడూ ఇంటికి వెళ్ళి వస్తుండే నన్ను "జీవ నది" లాంటి మనిషి చేతులు కట్టుకు నిలుచున్న తీరు ఒక్కసారిగా నన్ను నాలోంచి బయట నుంచి నాలోకి నన్ను స్థిమితం లేని ఊయలని చేసింది, స్థిరత్వం చిక్కక వ్యాకులత కలిగింది.
శుక్రవారం కదా పూజకి పూలూ పళ్ళూ కొనడానికి వెళ్ళింది ఇల్లాలు. చేతిలో ఏలాగూ పుస్తకం ఉంది కదా T.V కట్టేసాను. అన్న సామిడి జగన్ రెడ్డి గారి ముంది మాట సుదీర్ఘంగా చరిత్ర సహితంగా కొనసాగటం అతిశయోక్తి ఏమాత్రమూ కాదు, జగనన్న మాటల్లోనే Dr.యాకూబ్ "కాలం రచించుకొన్న కవి" చరిత్రగా రాయదగిన మనిషి.
నాకొక పాత అలవాటుంది. పుస్తకాన్ని ఒకసారి బొటన వేలితో అలా పై నుంచి లాగి అప్పుడు వచ్చే శబ్దంలోని లయని ఆస్వాదించే దుగ్ద మానుకోలేనిది, ఈ సారి అలా కాలేదు యాదృచ్చికంగా 75వ పేజీ దగ్గర ఆగిపోయింది సంబమాశ్చర్యంగా 74వ పేజీలో " నదీ మూలం లాంటి ఆ ఇల్లు!" కవిత ఉంది.
ఒకటికి రెందుసార్లు మళ్ళీ మళ్ళీ చదివాను యాకూబ్ ఎప్పుడో "జీవితంలోంచి కవిత్వం రాయాలి" అన్న మాట పదే పదే గుర్తుకొచ్చింది. ఒక స్వచ్చమైన జ్ఞాపకం " కలల్లోనూ అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూ లేచి, పక్కలో తడుముకొని"...సాదారణంగా నిద్రలో లేచి పక్కలో ఏమి తడుముకుంటాం మనం కళ్ళ జోడో ఫొనో, పిల్లలనో, బార్యనో ఒక్కో మనిషి ఒక్కో రకంగా వెదుక్కుంటాం, ఇక్కడ ఓ నిముషం "కవే ఆ ఇల్లు - ఇల్లు కవి రూపం" ఎత్తుగడ వలన అయిఉండవచ్చు ఇలాంటి ఆలోచనలు కొన్ని కలిగాయి. ఎత్తుగడలో.....
ఇల్లంటే చిన్నపటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారభందం
చిన్ని చిన్ని కిటికీలు రెండు
కొన్ని దూలాలు, వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు
అన్న కవి
అప్పటికికవి ప్రేమిస్తాయి
ఇంకా నాలో మిగిలి ఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి.
అని తనని తాను అనునయించుకొంటాడు.
"ఇంకుతున్నప్పుడు నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను" అంటూ కవి "ఋణమేదో అంతుబట్టని రహస్యమై కలల్ని ముట్టడిస్తుంది.గాయాల సౌంద్ర్య రహస్యమేదో చిక్కని ప్రశ్నలా వెంటాడుతుంది" అన్నప్పుదు గుండె బరువెక్కుతుంది.
ఈ కవితని నేను నాలుగైదు రకాలుగా ముందునుంచి వెనుకకి వెనుకనుంచి ముందుకి మద్య నుంచి మద్యలోకి ఒకసారి ఇలా కూడా చదివా....
ఊళ్ళో ఇప్పుడెవరూ లేరు వృద్దాప్యంలో ఉన్న ఇల్లు తప్ప
అక్కడున్నదంతా ఖాళీ ఖాళీ నేలే కావచ్చు
అక్కడొక జీవితం ఉంది
ఇలా ఎలా ఎటునుంచి చదువుకున్నా ఈకవిత ఎక్కడా తడబడదు మూలం నుంచి విడివడదు.
జీవితం కవిత్వమైనప్పుడు కవిత్వం కవీ ఒకటే కాబడతారు, కవి స్వబావం మనస్తత్వం కవిత్వం స్పస్టపరుస్తుంది. ముగింపులో కొసమెరుపై "చాలా చోట్లకు" (తనకు వెన్నుదన్నుగా నిలిచిన చోటుకల్లా) అన్నప్పుడు Dr.కవి యాకూబ్ గారి సంస్కార విస్తృతి స్పస్టమౌతుంది.
చాలా చోట్లకు వెళ్లలేకపోవడం క్షమించలేని నేరమే,
మరీ ముఖ్యంగా నదీ మూలం లాంటి ఆ ఇంటికి.
ఇప్పటికి ఒక కవితే చదివాను...మళ్ళీ కలుద్దాం
సశేషం,
మీ
మూడో వేప చెట్టు
వర్మ.కలిదిండి.
99489 43337

Monday 11 August 2014

కె.ఎన్.వి.ఎం.వర్మ//తులాభారం//

కె.ఎన్.వి.ఎం.వర్మ//తులాభారం//

సంద్రపు ఒడ్డున తీరంలో మిగిలిపోయిన తడి నీకళ్ళలో చూడలేదనుకోకు

నీకన్నా ఇంకా చిన్నపిల్లని వెదుకుతున్నాను
చెతిలో బ్యాగుల్ని నేనంటే నేను తల్లుల్లా పట్టుకోస్తానన్నాకూతురు
పొట్టని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నట్టు
నేనిన్ను భర్తనై ప్రియుడినై ఆలింగనం చేసుకోలేను
కొడుకులా నువ్వు పెంచనూ లేదు
నే నీలా చినుకును కాను
వర్షాన్ని కాను
సెలయేరును కాను, జీవనదిని కాను
సాగరాన్ని కాను, వ్యక్తాన్ని అంతకన్నాకాను
నే నాలా
నేల గుండెల్లో దిగమింగుకొని
ఊట చెరువు సమతుల్యం కోసం ఉబికి వచ్చేవాణ్ణి

బిళ్ల పెంకు విసిరి కప్పాట ఆడుకున్నా
కడవల కొద్దీ దాహార్తి తీర్చుకున్నా
రేవులో పసుపు పాదాలు కాళ్ల పసిడి పట్టాలు చూసి
కలువల్లే పూసే బురదని.

ప్రియుడిని కాలేక పోయానని
భర్తగా బరించలేక పోయానని
కార్తీక దీపం నా దేహం మీద వదిలినప్పుడు
నిశ్చల తటాకం మీద నీ ప్రతిబింబమే కనిపిస్తుంది.

చిన్నారీ
అన్నీ నేర్పాలనుకొనే తండ్రిని కదూ
నీకెన్నటికీ అర్ధం కాను.

భార్యవి కదూ
నువ్వూ ప్రియురాలివీ కాలేక పోయావు....02.08.2014.