Tuesday 8 December 2015

వర్మ కలిదిండి //ఒక్కరైనా...//

వీధి మొదలైన చివరనుంచి
ఇయర్ ఫోన్లు ఉన్నాకూడా,
ఆ పిల్ల బిగ్గరగా మాట్లాడుతోంది.
బారు వెనుక రైల్వే వీధిలో
హెల్మెట్టు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు తప్పించుకొంటూ
నేను దూరినంతలో.....
ఆ పిల్ల ఒంటరిగా
రెండు రైలు పట్టాలు
దాటి ఇంటికి దారిలో...
ఒక పట్టా
వేశ్యలు
రెండో పట్టాలో
విటులు
నమ్మ బుద్దికాని మూడో జాతి
లోకం బుద్దిలాంటి మూక
ఆ పిల్ల ఈ లోకాన్ని దాటటానికి
బిగ్గరగా ఎవరితోనో మాట్లాడుతూ,
రైల్వే స్టేషను వెనుక వీధి దాటుతుంది.
తిడుతుందోనని సిగ్గుతో నేనేమో
తప్పుకు దాక్కుంటాను.
మాటలో పాటలో
ఆ పిల్లకి తోడువచ్చినట్టు,
అసాంఘీక శక్తుల నుంచి కాపడటానికి
రైలులో ఒక్కరన్నా రాకపోతారా
ఈ లోకానికి......07.12.15